ఘనంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

జగిత్యాల/ధర్మపురి, వెలుగు: ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం యోగ లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తిని మంత్రోచ్ఛారణల మధ్య మంగళ వాయిద్యాలతో ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. పుష్కరిణిలో హంస వాహనం పై స్వామి వారిని ఉంచి తెప్పోత్సవం నిర్వహించారు.

అనంతరం మండపంలోని పల్లకీలోకి తీసుకెళ్లి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని మాట్లాడారు. లక్ష్మీ నరసింహుడి కరుణ కటాక్షలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.